Pages Menu
Categories Menu

Posted by on Jan 16, 2012 in  Other, TG Roundup

నాట్ బిఫోర్ అంటే ఏమిటి?

లీగల్‌ సిండికేట్‌ ప్రజాస్వామ్యానికి ప్రమాదమా? 

పిటీషన్ ను ఉపసంహరించుకున్న విజయమ్మ

ప్రజాస్వామ్యం  ప్రమాదంలో పడిపోతోందా?

చంద్రబాబు ఆస్తుల కేసును వేరే హైకోర్టుకు బదిలీ చేయాలన్న వై.ఎస్.విజయమ్మ పిటిషన్ ను ఉపసంహరించుకోవలసిందిగా సుప్రింకోర్టు సూచించింది. దీనివల్ల కోర్టుల ప్రతిష్ట దెబ్బతింటుందని సుప్రిం వ్యాఖ్యానించింది.అయితే అదే సమయంలో చంద్రబాబు కేసును నాట్ బిఫోర్ పేరుతో ఎనిమిది బెంచ్ లు మార్చడంపై కూడా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు కధనాలు వస్తున్నాయి. ఇలా బెంచ్ లు మార్చడం సరికాదని సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది.ఇతర రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితులు ఉండవేమిటని కూడా కోర్టు ప్రశ్నించింది. విజయమ్మ పిటీషన్ దేశ న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్నే ప్రశ్నించిలా ఉందని కూడా సుప్రీం అభిప్రాయపడింది. కాగా సుప్రింకోర్టు సూచన మేరకు విజయమ్మ తరపు న్యాయవాది పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.చంద్రబాబు ఆస్తుల కేసులో బెంచ్ మార్చిన ఎనిమిది మంది లాయర్ల జాబితాను కూడా కోర్టుకు వీరు అంద చేశారు.సుప్రింకోర్టు న్యాయ వ్యవస్థ ప్రతిష్టను సంరక్షించడానికి యత్నించడం సమంజసమే అయినా, అసలు నిజంగా న్యాయ వ్యవస్థ లో జరుగుతున్న లోపాలను కూడా సరిదిద్దడానికి కృషిచేస్తామని చెప్పి ఉంటే బాగుండేది. సరే, ఈ తాజా పరిణామాల నేపథ్యంలో అసలు నాట్ బిఫోర్ వ్యవహారమంటే ఎమిటీ, అది మన రాష్ట్ర న్యాయస్థానాల్లో ఎలా పాతుకుపోయిందో తెలుసుకుందాం.

 

చీఫ్‌ జస్టిస్‌ హైకోర్టుకు వచ్చిన కేసులను రోస్టర్‌ పద్ధతిలో జడ్జిలకు పంపుతారు. దీనివల్ల ఎల్లప్పుడూ ఒకే జడ్జి ఒకే తరహా కేసులను విచారించే అవకాశం ఉండదు. అందుకే కక్షిదార్లు తమకు అనుకూలమైన జడ్జిలను ఎంపిక చేసుకునేందుకు నాట్‌ బిఫోర్‌ను రంగం మీదికి తెస్తున్నారు.

 

దేశవ్యాప్తంగా మద్యం, ఇసుక సిండికేట్లపై ఎసిబి, విజిలెన్స్‌ దాడులు జరుగుతున్నాయి. సిండికేట్‌ అన్న పదం వినగానే ప్రజలకు స్ఫురించే అర్థం అక్రమ మార్గం. నీతి బాహ్యమైన వ్యవహారం. చట్టపరమైన నియమ నిబంధనలను, సహజ న్యాయ సూత్రాలను అతిక్రమించి అడ్డదారుల్లో డబ్బులు సంపాదించే వారు కట్టే అపవిత్ర కూటమే సిండికేట్‌. ఇటువంటి ముఠాలు ప్రజలు అత్యున్నతంగా భావించి గౌరవించే న్యాయ వ్యవస్థలో పుట్టుకొస్తున్నాయని న్యాయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

కోర్టులన్నా, న్యాయమూర్తులన్నా, న్యాయవాదులన్నా ప్రజలకు, కక్షిదార్లకు ఎంతో గౌరవం, నమ్మకం, విశ్వాసం. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు ఉన్న స్థానమే అందుకు తార్కాణం. అందుకే తమకు కోర్టుల్లో కచ్చితంగా న్యాయం దొరుకుతుందని ప్రజలు విశ్వసిస్తారు. వారి విశ్వాసానికి తూట్లు పొడిచే సిండికేట్లు న్యాయ వ్యవస్థలో ప్రవేశించాయని ఆరోపణలు వినబడుతున్నాయి. రాజ్యాంగబద్ధ, అత్యంత గౌరవప్రదమైన న్యాయవ్యవస్థకు అప్రదిష్ట తెస్తున్నాయంటున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వారికి లొంగకుండా ఉండేందుకు, ఆ విధంగా ఎవరికీ తమపై సందేహం సైతం కలగకూడదన్న సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయమూర్తులు స్వచ్ఛందంగా విధించుకున్న స్వీయ నియంత్రణే ‘నాట్‌ బిఫోర్‌‘. మంచి ఉద్దేశంతో అమలు చేస్తున్న ఈ నాట్‌ బిఫోర్‌ నిబంధనను దారి మళ్లించే ప్రబుద్ధులు కోర్టుల్లో తయారవడం ఆందోళనకరం.

 

కొద్ది రోజులుగా నాట్‌ బిఫోర్‌ అనేది చర్చనీయాంశమైంది. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఆయన తనయుడు జగన్‌ అక్రమ ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ, దీనిపై సమగ్రంగా విచారణ జరిపించాలని మంత్రి శంకర్రావు (లేఖ రాసినప్పుడు ఎమ్మెల్యే) హైకోర్టుకు లేఖ రాశారు. టిడిపి నేతలు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు తదితరులు ఇదే అంశంపై కోర్టులో పిటిషన్లు వేశారు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిస్సార్‌ అహ్మద్‌ కక్రూ, జస్టిస్‌ విలాస్‌ వి అఫ్జల్‌ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం జగన్‌ ఆస్తులపై సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు, ఆయన బినామీలు అక్రమ ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ, దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అప్పుడు తాత్కాలిక ఛీఫ్‌ జస్టిస్‌గా ఉన్న గులాం మహ్మద్‌, నూతి రామ్మోహనరావులతో కూడిన హైకోర్టు ధర్మాసనం చంద్రబాబు ఆస్తులపై సిబిఐ, ఇడిల ప్రాథమిక విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న మురళీమోహన్‌, సిఎం రమేష్‌ తదితరులు హైకోర్టు ఆదేశాలను నిలిపి వేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించగా హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. విచారణకు ఆదేశించిన జస్టిస్‌ గులాం మహ్మద్‌ బెంచ్‌కు తమ పిటిషన్లు వెళితే తమకు వ్యతిరేక ఫలితం వస్తుందని భావించిన చంద్రబాబు, మురళీమోహన్‌, సిఎం రమేష్‌ తదితరులు విజయవంతంగా నాట్‌ బిఫోర్‌ అస్త్రాన్ని సంధించారు. ఫలితంగా వారి పిటిషన్లు మూడు బెంచ్‌లను దాటుకొని చివరికి జస్టిస్‌ రోహిణి, జస్టిస్‌ మొహంతాతో కూడిన బెంచ్‌కి చేరాయి. చంద్రబాబు, తదితరులపై సిబిఐ, ఇడి సంస్థలతో దర్యాప్తు జరిపించాలని గతంలో గులాం మహ్మద్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ జస్టిస్‌ రోహిణి ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. జగన్‌, చంద్రబాబు, అక్రమంగా ఆస్తులు కూడబెట్టి ఉండవచ్చు. వారి రాజకీయ ఆధిపత్యపోరు సంగతి ఎలా ఉన్నా వీరి కేసుల నేపథ్యంలో హైకోర్టులో అమలవుతున్న నాట్‌ బిఫోర్‌ దుర్వినియోగమవుతున్న విషయం బహిర్గతమైంది.

 

కోర్టు తీర్పులనే ప్రభావితం చేస్తున్న నాట్‌ బిఫోర్‌ అంటే ఏమిటంటే… న్యాయమూర్తులను ప్రభుత్వం బార్‌ కౌన్సిల్‌ నుండి ఎంపిక చేస్తుంది. జడ్జి కాకముందు ఆయన కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసి ఉంటారు. న్యాయవాదుల్లో ఆయనకు సీనియర్లు, జూనియర్లు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఉంటారు. న్యాయమూర్తి అయిన తర్వాత గతంలో తమతో సన్నిహితంగా మెలిగిన అడ్వకేట్ల కేసులను విచారణకు చేపడితే తమ వారికి ప్రయోజనం కలిగే తీర్పులు ఇస్తారన్న అపవాదును మూటగట్టుకునే అవకాశం ఉంది. ఇలాంటి అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకుగాను తమ వద్దకు వచ్చే తమకు సంబంధించిన లాయర్ల కేసులను విచారణకు స్వీకరించకుండా జడ్జిలు విధించుకున్న నియమమే నాట్‌ బిఫోర్‌. సదుద్దేశంతో అమలు చేస్తున్న ఈ నాట్‌ బిఫోర్‌ జడ్జిలు, అడ్వకేట్ల సచ్ఛీలతను ప్రతిబింబించాల్సింది పోయి వ్యవస్థలో నైతిక విలువలు దిగజారడానికి కారణమవుతున్నది. కొంత మంది న్యాయవాదులు ఉద్దేశ పూర్వకంగా జడ్జిలతో గొడవ పెట్టుకొని నాట్‌ బిఫోర్‌ జాబితాలోకి చేరుతున్నారు. ఇక ఆ లాయర్ల కేసుల విచారణను సదరు న్యాయమూర్తి చేపట్ట కూడదనే ఈ ప్రయత్నం. లాయర్‌ కోర్టులో వాదించకపోతే ప్రాక్టీస్‌ ఎలా చేస్తారని అనుకోచ్చు. ఇక్కడే కిటుకుంది. నాట్‌ బిఫోర్‌ వల్ల తమకు అనుకూలమైన జడ్జిల వద్దకు తమ కేసులు వెళ్లేటట్లు చేసుకునే వెసులుబాటు వాదులు, ప్రతివాదులకు కలుగుతోంది. అందుకే కొంతమంది జడ్జిల వద్ద కొంత మంది లాయర్లు ఉద్దేశపూర్వకంగా నాట్‌ బిఫోర్‌ జాబితాలో చేరుతున్నారు. తమకు వ్యతిరేకమైన జడ్జిల వద్దకు కేసులు వెళ్లకూడదనుకున్న కక్షిదార్లు నాట్‌ బిఫోర్‌ లాయర్లను ఆశ్రయించి సునాయాసంగా ఆ జడ్జి నుండి కేసును వేరే జడ్జి వద్దకు మార్పించుకుంటున్నారు. ఈ పని చేసినందుకు నాట్‌ బిఫోర్‌ లాయర్లు అత్యధికంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఇది ఫోరం పర్చేజి కిందకు వస్తుందన్న విమర్శలు ఉన్నాయి.

 

చీఫ్‌ జస్టిస్‌ హైకోర్టుకు వచ్చిన కేసులను రోస్టర్‌ పద్ధతిలో జడ్జిలకు పంపుతారు. దీనివల్ల ఎల్లప్పుడూ ఒకే జడ్జి ఒకే తరహా కేసులను విచారించే అవకాశం ఉండదు. అందుకే కక్షిదార్లు తమకు అనుకూలమైన జడ్జిలను ఎంపిక చేసుకునేందుకు నాట్‌ బిఫోర్‌ను రంగం మీదికి తెస్తున్నారు. చంద్రబాబు కేసు విషయానికొస్తే తమపై విచారణకు ఆదేశించిన గులాం మహ్మద్‌, నూతి రామ్మోహనరావు బెంచ్‌కు తమ పిటిషన్లు వెళ్లకుండా ఉండేందుకు నాట్‌ బిఫోర్‌ సహాయ పడింది. దీంతో చీఫ్‌ జస్టిస్‌ లోకూర్‌ విచారణ చేపట్టిన సమయంలో రిలయన్స్‌ అనూహ్యంగా కేసులో ఇంప్లీడ్‌ అయింది. రిలయన్స్‌లో తనకు షేర్లుండటంతో కేసును తాను విచారించడం భావ్యం కాదనుకున్న చీఫ్‌ జస్టిస్‌ లోకూర్‌ కేసును జస్టిస్‌ ఈశ్వరయ్య బెంచ్‌కు నివేదించారు. జస్టిస్‌ ఈశ్వరయ్య కుటుంబానికి గతంలో తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉందని విజయమ్మ తరఫు న్యాయవాది వాదించడంతో జస్టిస్‌ ఈశ్వరయ్య బెంచ్‌ విచారణ నుండి తప్పుకుంది. చివరికి జస్టిస్‌ రోహిణి బెంచ్‌కు కేసు వెళ్లింది. సుప్రీం కోర్టులో, ఏ ఇతర రాష్ట్ర హైకోర్టుల్లో లేని నాట్‌ బిఫోర్‌ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని, నాట్‌ బిఫోర్‌ ఉన్నచోట తాను వాదించబోనని విజయమ్మ తరఫు న్యాయవాది వాదించారు. ఈ హైకోర్టుపై నమ్మకం లేదని, వేరే హైకోర్టుకు తమ కేసును బదిలీ చేయాలని విజయమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఎక్కడా లేని నాట్‌ బిఫోర్‌ మన దగ్గరే ఎందుకుందన్న చర్చ మొదలైంది. జడ్జిలు స్వచ్ఛందంగా విధించుకున్న ఈ నిబంధనను తమకు వద్దనుకుంటే హైకోర్టు ఫుల్‌బెంచ్‌ సమావేశమై రద్దు చేసుకోవచ్చు. హైకోర్టు అందుకు ముందుకొస్తుందో లేదో చూడాలి.

 

దేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక కార్పొరేట్‌ రంగం బలపడింది. డబ్బుతో ఏమైనా చేయొచ్చన్న స్థాయికి అన్ని వ్యవస్థలనూ కార్పొరేట్‌ దిగజారుస్తోంది. న్యాయవ్యవస్థనూ బిజినెస్‌ బిగ్‌ బుల్స్‌ కలుషితం చేస్తున్నారు. నాట్‌ బిఫోర్‌ లాంటి లొసుగులను వాడుకుంటున్నారు. ఒక్క నాట్‌ బిఫోర్‌ మాత్రమే కాదు జడ్జిలకు అనుకూలంగా ఉండే అడ్వకేట్లను పెట్టుకునే వరకు విలువలు పతనమైనట్లు ఆరోపణలొస్తున్నాయి. ఎలాగైనా కేసు గెలవాలి అన్న లక్ష్యమే ప్రధానమైంది. అందులో భాగంగానే జడ్జిలకు అనుకూల, వ్యతిరేక లాయర్లను ఎంపిక చేసుకుంటున్నారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ బాపతు కోర్టులో సిండికేట్‌గా రూపొంది లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ న్యాయాన్ని మార్కెట్‌ సరకుగా మార్చి వేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. కేసును బట్టి న్యాయం కాకుండా జడ్జి, ఎడ్వకేట్‌ను బట్టి న్యాయం అన్నంతగా వ్యవస్థలో విలువలు పతనమవుతున్నాయన్న అభిప్రాయం న్యాయ నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఈ ధోరణి బలపడితే కోర్టు కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుంది. అంతిమంగా డబ్బున్నవారికి తప్ప సామాన్యులకు న్యాయం అందని ద్రాక్ష అవుతుంది. కోర్టులను ఆశ్రయించిన సామాన్యులకు ఈ సిండికేట్ల గురించి తెలీదు. ఒక వేళ తెలిసినా అంతంత డబ్బు పోసి లాయర్లను పెట్టుకోలేరు. ఈ జాడ్యం ముదిరితే చివరికి న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం, నమ్మకం, విశ్వసనీయత సన్నగిల్లే ప్రమాదం ఉంది.

 

తమ ముందు ఎవరు కేసును వాదిస్తున్నారో తమకు తెలిసే అవకాశం లేదని జడ్జిలు చెబుతున్నప్పటికి పరిస్థితిని చూస్తే ఆ రకంగా అనిపించట్లేదంటున్నారు న్యాయ నిపుణులు. జడ్జిల నియామకం ప్రజాతంత్ర పద్ధతుల్లో జరగట్లేదని వారు వాపోతున్నారు. హైకోర్టు కొలీజియం సిఫారసులను బట్టి న్యాయ మూర్తుల ఎంపిక జరుగుతోంది. ఎంపికలో అనేక ప్రభావాలు పని చేస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1990 తర్వాత న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ జోక్యం పెరిగింది. అంతే కాకుండా నియమితులైన జడ్జిలకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించడం ప్రారంభమైంది. చంద్రబాబు హయాంలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పని చేసిన ప్రభాత్‌ శంకర్‌ మిశ్రా బెంగాల్‌కు వెళ్లి ఇక్కడ కల్పించినట్లుగా సౌకర్యాలు కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. జడ్జిలుగా ఒకసారి నియమితులైన తర్వాత వారిని ప్రభుత్వాలు సైతం కదల్చలేవు. పార్లమెంట్‌ ఆ పని చేయాలి. ఈ మధ్య అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బెంగాల్‌ హైకోర్టు జడ్జి సౌమిత్రా సేన్‌పై రాజ్యసభలో చర్చ జరగడంతో చివరి నిమిషంలో ఆయన వైదొలగాల్సి వచ్చింది. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. న్యాయమూర్తుల సంఖ్య కేసులకు తగ్గట్టు ఉండట్లేదు. ఒకో జడ్జి వద్ద నాలుగైదొందల కేసులు ఉంటున్నాయి. కంప్యూటరైజేషన్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, తగిన సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చట్లేదు. కేసుల విచారణ పెండింగ్‌ పడుతోంది. ఈ సమస్యల వల్ల నేరం చేసిన వారికి వెంటనే శిక్ష పడట్లేదు. సంవత్సరాల తరబడి కేసులు నడుస్తుండటంతో నేరం చేసినా ఇప్పుడప్పుడే ఏం కాదన్న భరోసా నేరస్తుల్లోనూ, న్యాయం సకాలంలో అందట్లేదన్న బాధ బాధితుల్లోనూ వ్యక్తమవుతోంది. కోర్టుల్లో సత్వర న్యాయం అందకపోవడంతో ఒక్క రోజులో పరిష్కారం లభించే ప్రైవేటు సెటిల్మెంట్లను ప్రజలు అనివార్యంగా ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు సెటిల్మెంట్లు చేసే ఒక తరహా ముఠాలు సమాజంలో వృద్ధి చెందుతూ శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, న్యాయ వ్యవస్థలో విలువలు దిగజారడం, కార్పొరేట్‌ రంగం బలపడటం వెరసి న్యాయ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్ధకమైంది. ఈ ధోరణిని సరి చేయకపోతే అంతిమంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.

– టీఎన్నార్