Pages Menu
Categories Menu

Posted by on Jan 11, 2012 in Opinion, TG Roundup

బక్కచిక్కిన బాల్యం ప్రభుత్వాలు కూల్చగలదా?

ఓట్లు రాగానే అటకెక్కించిన పథకాలు

 ఏటుచూసినా ఎదిగీఎదగని బాల్యం

 సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు

 ప్రధాని నోటనే చేదునిజాలు

 గడ్డుకాలాన్ని సూచిస్తున్న సర్వే   

 

 

బక్కచిక్కిన బాల్యం ప్రభుత్వాలను కూలుస్తుందా? ఈమాట వినగానే మీరు ఉలిక్కిపడవచ్చు. అసందర్భంగా ఉన్నదంటూ కొట్టిపారేయవచ్చు. కానీ, పూర్తిగా చదివితే వాస్తవాలు మీకే అర్థమవుతాయి.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నుంచి కొన్ని చేదు నిజాలు బయటపడ్డాయి. ఏ సంక్షేమ పథకాలను చూపిస్తూ ఓట్లు దండుకుంటున్నారో, అవి పూర్తిగా డొల్ల అని తేలిపోయింది. చిన్నారుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఎలా ఆటలు ఆడుకుంటుందో అందరికి అర్థమైపోయింది. ఒక పక్క ఐదు రాష్ట్రాల ఎన్నికలు, మరో పక్క 2014లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రధాని నోటి నుంచే భయంకర సత్యాలు వెలుగుచూడటం యూపీఏ సర్కార్ సంకట స్థితిని సూచిస్తోంది. ఏ పథకాలను చూపిస్తూ ఓట్లు దండుకోవాలనుకుంటున్నారో ఆ పథకాల్లోని డొల్లతనం సర్కార్ పెద్దల్నే వెక్కిరిస్తోంది.

పౌష్టికాహారలోపం జాతికే పెనుశాపంగా పరిణమించిందనీ, ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమేనంటూ మన్మోహన్ స్వయంగా అంగీకరించరు. ఐదేళ్లలోపు పిల్లల్లో 42శాతం మంది malnourishmentతో బాధపడుతుంటే బక్కచిక్కిపోతుంటే, ఈ దేశానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుందని ఎలా ఊహించుకోగలమంటూ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోని 9 రాష్ట్రాల్లోని 112 జిల్లాల్లో 74,000 మంది గృహిణుల, లక్షమంది చిన్నారుల స్థితిగతులను తెలుసుకున్న తర్వాత,  హంగర్ అండ్ మాల్ న్యూట్రిషన్  సర్వే 2011 తేల్చి చెప్పిన నిజాలు..

– ఐదేళ్ల లోపు పిల్లల్లో 42 శాతం మంది బక్కచిక్కి ఉన్నారు.

– 59 శాతం మంది సరిగా ఎదగలేదు

– నవజాత శిశువులకు వచ్చే వ్యాధుల కారణంగా మనదేశంలో ప్రతి 15 సెకండ్లకు ఒక శిశువు మృత్యువాత పడుతోంది.

– ఐదేళ్లలోపే 20 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు.

– పుట్టిన 24 గంటల్లోపే మృత్యువాత పడే వారి సంఖ్య ఏటా నాలుగు లక్షలపైమాటే. 

– ప్రపంచవ్యాప్తంగా  శిశుమరణాల్లో 20శాతం మనదేశంలోనే సంభవిస్తున్నాయి. 

మాతాశిశు సంరక్షణ కోసం అద్భుతమైన పథకాలను తీసుకువస్తున్నట్టు హంగామాచేసే ప్రభుత్వం ఈ సర్వే లెక్కలతో గుడ్లుతేలేస్తోంది. సమగ్ర శిశుఅభివృద్ధి పథకం- ఐసీడీఎస్, స్కూల్ పిల్లలకోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్నఆహారపథకం, సర్వశిక్ష అభియాన్ పథకాల వల్ల చిన్నారులకు ఒరిగింది ఏమీలేదని తేలిపోయింది. కీలకమైన అంగన్ వాడీ వ్యవస్థను చాలా రాష్ట్రాలు సరిగా పట్టించుకోవడంలేదు. అనేక చోట్ల అంగన్ వాడీలకు కేవలం 1,800 రూపాయలతో సరిపుచ్చుతున్నారు. తమిళనాడులో మాత్రం రాజకీయ లబ్దేకానివ్వండీ, లేదా మెరుగైన నిధుల సమీకరణే కానివ్వండి అక్కడ అంగన్ వాడీ వ్యవస్థ పటిష్టంగానే ఉంది. కానీ ఈ పరిస్థితి మిగతాచోట్లలేదు. ప్రస్తుత దురదృష్టకర పరిస్థితికి ఇది కూడా ఓ కారణమే.

Malnutrition అంటే అదేదో కేవలం పిల్లలకు సంబంధించిన వ్యవహారమేనంటూ నిర్లక్ష్యంగా కూర్చోకూడదు. దేశ సమగ్రాభివృద్ధికి ఇదో  శాపం. దేశ ఆర్థికాభివృద్ధి బాగానే ఉన్నదంటూ చంకలుగుద్దుకోవడంకంటే, Malnutrition తగ్గించడానికి ఇప్పటికైనా పాలకులు దృష్టి సారించాలి. లేకుంటే ఇప్పుడు వెలువడిన వాస్తవాలే ప్రభుత్వాలను కూల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓట్లు వేసే ప్రజలంతా గుడ్డివాళ్లని అనుకోవడం సర్కార్ పెద్దల పచ్చకామెర్ల చూపునే తెలియజేస్తోంది. సో, ఈసారి ఓటు వేసేటప్పుడు బక్కచిక్కిన బాల్యాన్ని ఓసారి గుర్తుతెచ్చుకోండి.

 

– తుర్లపాటి నాగభూషణ రావు