Pages Menu
Categories Menu

Posted by on Jan 19, 2012 in India, Opinion, Telugu Nadu

స్పీకర్ ఏంచేయబోతున్నారు?


శాసన సభలో సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రమే తరచూ దాని గురించి వార్తలు వస్తుంటాయి. 
అయితే, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మొన్నటి శీతాకాల సమావేశాలు ముగిసినా అసెంబ్లీ చుట్టూనే 
వార్తలు తిరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, కీలకమైన రాజకీయ పరిణామాలకు అసెంబ్లీ కేంద్ర బిందువు 
అవుతోంది.
 ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ప్రస్తావిస్తాను. మన రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని కీలక అంశాలన్నింటినీ 
ఏకకాలంలో ఉపయోగించుకుంటున్నది ఎక్కడో తెలుసా.. మన రాష్ట్రంలోనే. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కిందనే 
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దుకు సంబంధించిన ప్రధానాంశాలు కూడా 
ఈ షెడ్యూల్ కిందనే ఉన్నాయి. భవిష్యత్తులో ఏ తరహా ఇబ్బందులు ఎదరవడానికి వీలుందో వాటన్నింటినీ 
ముందుగానే ఊహించి మన రాజ్యాంగ నిర్మాతలు ఈ షెడ్యూల్ ని పొందుపరిచారు.. ఇప్పుడది మన రాష్ట్రానికి 
అతికినట్టు సరిపోతోంది. ఈ షెడ్యూల్ లోని నిబంధనలు తరచిచూస్తే చాలు సమస్యకు పరష్కారం దొరుకుతుంది . 
ఇందులో ఉన్న ఇతర అంశాలు...
  • పార్టీల విలీనం
  • విలీనానికి అంగీకరించని సభ్యుల భవితవ్యం
  • స్వతంత్ర్య అభ్యర్థులుగా ఎన్నికై, అనుబంధ సభ్యులుగా కొనసాగేవారు.
  • పార్టీ ఆదేశాలను అతిక్రమించేవారు.
  • పార్టీ విప్ ను ధిక్కరించేవారు
  • స్వచ్ఛందంగా పదవులు త్యజించేవారు..
 విఫ్ ని దిక్కరించినా పార్టీలు క్షమించడం...ఇలాంటి అంశాలన్నీ మన రాజ్యంగ నిపుణులు ఏనాడో ప్రస్తావించడం 
గమనార్హం. ఇక్కడే ఇంకో మాట ప్రస్తావిస్తాను... పదో షెడ్యూల్ లోని ఈ అంశాలన్నీ ఈ మధ్య రాష్ట్ర అసెంబ్లీ 
శీతాకాల సమావేశాల్లోనే చోటుచేసుకోవడం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం నడుస్తున్న పదమూడవ 
శాసనసభ గురించి వచ్చిన, వస్తున్న వార్తలు గతంలోని పన్నెండు శాసనసభల కాలంలో రాలేదు. అసలు, పద్దెనిమిది 
మంది ఎమ్మెల్యేలు. ముగ్గురు ఎమ్మెల్సీల సభ్యత్వాల రద్దు విషయం ఒకేసారి విచారణకు రావడం కూడా ఓ అరుదైన
ఘటనే. వీరిలో పదహారుమంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావడం 
గమనార్హం. కాగా, పీఆర్పీ నుంచి శోభానాగిరెడ్డి, టీడీపీ నుంచి బాలనాగిరెడ్డి అనర్హత విచారణ ఎదుర్కుంటున్నారు.
 ప్రజారాజ్యం పరిస్థితి ఏమిటంటే, ఆ పార్టీ కాంగ్రెస్ లో అధికారికంగా విలీనం అయింది.  ఎన్నికల కమిషన్ రూల్స్ 
ప్రకారం చూస్తే ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు లేనట్టే. అయితే, అసెంబ్లీలో మాత్రం పీఆర్పీ ఉనికి అలాగే ఉంది. 
ఎందుకంటే, శాసనసభ నిబంధనావళి ప్రకారం చూస్తే, విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. ఈలోగానే అసెంబ్లీలో మొన్న 
అవిశ్వాస తీర్మానం వచ్చేసింది. ఈ సందర్భంగా ఓటు వేయాల్సి వచ్చినప్పుడు పీఆర్పీగానే ఆ పార్టీ సభ్యులను 
గుణించాల్సి వచ్చింది. అందుకే పీఆర్పీ కూడా అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన  సమయంలో తన పార్టీ సభ్యులకు 
పీఆర్పీ విఫ్ జారీచేసింది. ఈ కారణంగానే ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి సభ్యత్వాన్ని రద్దుకు ఆ పార్టీ ముందుకు వచ్చింది. 
విఫ్ ను దిక్కరించినందుకు వేటు వేయాలంటూ స్పీకర్ ను కోరింది.
 ఈ పరిణామాలు రాజ్యాంగంలోని పదోషెడ్యూల్ సూచించిన నిబంధనలను మరోసారి చాటిచెప్పినట్టే అయింది. 
ఒక విషయం తేటతెల్లమైంది. శాసనసభ వెలుపల పార్టీ మరో పార్టీలో విలీనమైనంత మాత్రాన ప్రక్రియ పూర్తి 
అయినట్టుకాదు. విలీనమైన పార్టీ ఈ మేరకు స్పీకర్ కు లేఖ రాయాలి. స్పీకర్ తగిన ఆధారాలను పరిశీలించి 
శాసనసభ్యుల అభిప్రాయాలు తెలుసుకుంటారు. అప్పుడెవరైనా విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తే వారిని వేరుగా గుర్తించే 
అవకాశాలుంటాయి. అనంతరం విలీన ప్రక్రియ పూర్తయినట్టు ప్రకటిస్తారు. అప్పుడే విలీనమైన పార్టీ, కలుపుకున్న 
పార్టీ సభ్యులు కలిసి అసెంబ్లీలో ఒకే చోట కోర్చోవడానికి వీలవుతుంది.
 మొత్తానికి రాష్ట్ర శాసనసభ ఔన్నత్యాన్ని కాపాడేలా స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం.
- తుర్లపాటి నాగభూషణ రావు