Pages Menu
Categories Menu

Posted by on May 27, 2012 in India, Telugu Nadu, TG Roundup

Jaganmohan Reddy Arrested

జగన్ అరెస్ట్

అక్రమ ఆస్తుల కేసులో గత మూడు రోజులుగా సీబీఐ విచారణ ఎదుర్కుంటున్న కడప పార్లమెంట్ సభ్యుడు జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు ఈ సాయంత్రం (ఆదివారం) రాత్రి 7-25 ప్రాంతంలోఅరెస్టు చేశారు. నిజానికి జగన్ అరెస్టు విషయం గత మూడు రోజులుగా ఊహిస్తున్నదే అయినప్పటికీ, జగన్ అరెస్టు వార్త రాష్ట్ర వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించింది. ఉన్నట్టుండి ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చింది.

అక్రమ ఆస్తులపై డొంకంతా కదలిస్తున్న సీబీఐ గత మూడు రోజులుగా కడప ఎంపీ జగన్ మోహన్ రెడ్డిని విచారించింది. ముఖ్యంగా మూడవ రోజు (ఆదివారం) అత్యం ఉత్కంఠ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో జగన్ అరెస్ట్ అవుతారన్న ఊహాగానాలు బలంగా వినిపించినప్పటికీ, రాత్రంతా విచారించి రేపు (సోమవారం) ఉదయం నేరుగా దిల్ కుషా గెస్ట్ హౌస్ నుంచి కోర్టుకు తీసుకువెళ్లే అవకాశంకూడా లేకపోలేదు. ఈ వార్త రాస్తున్న వేళకు (సాయంత్రం 7-15) తీవ్రస్థాయిలోనే టెన్షన్ ఏర్పడింది.

మూడో రోజు విచారణలో సైతం మధ్యాహ్నం లంచ్ సమయాన్ని మినహాయిస్తే, జగన్ పొద్దుటి నుంచి సాయంత్రం సుమారు ఆరు గంటల దాకా జగన్ ని సీబీఐ ఇంటరాగేషన్ చేసింది. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో సీబీఐ జెడీ లక్ష్మీనారాయణ కార్యాలయం నుంచి బయటకు వచ్చి కారులో బయటకు వెళ్ళారు. ఇది కాస్తంత ఆశ్చర్యకరంగా మారిన పరిణామంగానే చెప్పుకోవాలి. ఈలోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు (జూపూడి వంటి నేతలు) కాస్తంత ఆనందంగా కనిపించారు. దీంతో జగన్ అరెస్టు విషయంలో ఊగిసలాట ఏర్పడింది. కాగా, సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో విజయసాయిరెడ్డి విచారణ పూర్తి అయింది. ఆయన బయటకు వచ్చేశారు. ఏడు గంటల ప్రాంతంలో వైద్యుల బృందం ఒకటి దిల్ కుషాగెస్ట్ హౌస్ లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయనిపుణులతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ భేటీ అవ్వడానికే ఆయన ఆరుగంటల ప్రాంతంలో దిల్ కుషాగెస్ట్ హౌస్ ని విడిచిపెట్టి హోటల్ తాజ్ కృష్ణాకు వెళ్ళి అక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయనిపుణులతో చర్చించారు. విజయసాయిరెడ్డి వేసిన పిటీషన్ పైనే లక్ష్మీనారాయణ చర్చించినట్టు వార్తలందాయి. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్వకేట్ జనరల్ తో భేటీ అయ్యారు. కాగా రాత్రి ఏడున్నర ప్రాంతంలో జగన్ కుటుంబసభ్యులు దిల్ కుషా గెస్ట్ హౌస్ దగ్గరకు బయలుదేరారు.
ఉత్కంఠ పరిస్థితుల దృష్ట్యా రంగారెడ్డి జిల్లా వైకాపా అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఎమ్మెల్సీ కొండా మురళీని హన్మకొండలో అరెస్టు చేశారు. ఇక గుంటూరు జిల్లాలోనూ, ప్రకాశం జిల్లాలోనూ వైఎస్సార్ సిపీ నేతల్లో కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని వైఎస్సార్ సిపీ నేత గౌతం రెడ్డి ఇంటి చుట్టూ కూడా పోలీసులు చుట్టుముట్టారు. దాదాపుగా అనేక మంది వైఎస్సార్ సిపీ నేతల ఇళ్లు పోలీసుల దిగ్బంధంలో ఉండిపోయాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అదనపు పోలీస్ పికెట్ లు ఏర్పాటు చేశారు. బస్టాండ్ లు, రైల్వేస్టేషన్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా రాష్ట్రమంతటా రెడ్ ఎలెర్ట్ లో మునిగిపోయింది.
జగన్ అరెస్ట్ అవుతారన్న ఊహాగానాలు గత మూడురోజులుగా సాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో 144వ సెక్షన్ కూడా అమల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద కూడా ఆదివారం పోలీస్ బలగాలను పెంచారు. అంతేకాదు, నిన్న, ఈవేళ పోలీసు అధికారులు రెక్కీ కూడా నిర్వహించారు. రోడ్డుపై బ్యారికెడ్లు అమర్చారు. దిల్ కుషా దగ్గర రోడ్ డివైడర్ పై ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. లోటస్ పాండ్ దగ్గర నుంచి వైఎస్సార్ పార్టీ కార్యకర్తలను ఆదివారం సాయంత్రం నుంచి వెనక్కి పంపించే ప్రయత్నాలు పోలీసులు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని సీబీఐ కోర్టు జడ్జిల నివాసాల వద్ద కూడా పోలీసు బలగాలను మోహరించారు. అలాగే కాంగ్రెస్, టిడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఇళ్ల దగ్గర కూడా పోలీసులు మోహరించారు. నాంపల్లి కోర్టుకు వెళ్లే రోడ్లను సాయంత్రానికల్లా మూసివేశారు.
రాష్ట్ర భవన్ రోడ్డులో అదనపు బలగాలను మోహరించారు. రాష్ట్రమంతటా రెడ్ ఎలెర్ట్ ప్రకటించారు. అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలకు అత్యంత గోప్యంగా పోలీసు ఉన్నతాధికారులు సందేశాలు పంపారు. ఎలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు.
ఒక తెలుగు ఛానెల్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలోనే జగన్ అరెస్ట్ అయ్యారంటూ వార్తలివ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత మరో ఛానెల్ కొశ్చిన్ మార్క్ తో జగన్ అరెస్ట్ అంటూ స్క్రొలింగ్ ఇచ్చింది. మొత్తంగా సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో జగన్ అరెస్ట్ విషయంపై ముమ్మరంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే యుద్ధవాతావరణం తలపిస్తోంది. మిగతా తెలుగు ఛానెళ్లు మాత్రం సీబీఐ నుంచి అధికారికంగా వార్త అందేదాకా వేచి ఉండే పద్ధతిలోనే ప్రవర్తించాయి. అయితే, సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలోనే సీబీఐ రాష్ట్ర అధికారులు కేంద్ర అధికారులతో మాట్లాడారనీ, జగన్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్తలు వచ్చాయి.
నిమ్మగడ్డప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను చంచల్ గూడ జైలుకు తరలిస్తారని ముందుగా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే సీబీఐ వాహనంలో వీరిద్దరూ బయలుదేరారు. అయితే గేటు దాటేలోపే మళ్ళీ ఆ వాహనం లోపలకు వెళ్ళింది. దీంతో ఉత్కంఠ పరిస్థితి చోటుచేసుకున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి.
జగన్ అరెస్టు విషయంలో గత ఐదారు రోజులనుంచీ ఊహాగానాలు వెలువడుతున్నాయి. గుంటూరు జిల్లాలో జగన్ పర్యటిస్తూ, తనను సీబీఐ మరో నాలుగు రోజుల్లో అరెస్టు చేస్తుందట…అంటూ ఓ సంచలన వాఖ్యలు కూడా చేశారు. అందుకు తగ్గట్టుగానే ఈరోజు (ఆదివారం) సాయంత్రం ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రం ఐదున్నర గంటల అయినా జగన్ ని ఇంకా ఇంటరాగేషన్ చేస్తుండటం కూడా పలు అనుమానాలకు దారితీస్తోందని పార్టీ కార్యకర్తలు కలవరపడటం కనిపించింది.
ప్రస్తుత ఉత్కంఠ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అనేక జిల్లాల నుంచి ఆర్టీసీ తన సర్వీసులను రద్దు చేసింది.

– రిపోర్ట్ : తుర్లపాటి నాగభూషణ రావు