Pages Menu
Categories Menu

Posted by on Jan 7, 2012 in Podcasts, TG Roundup

సబితాశ్రీలక్ష్మీయం

సబితాశ్రీలక్ష్మీయం

 

ఒక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నా, ఒక కంపెనీకి స్థలాలు అప్పగించాలన్నా, రూల్స్ ని తుంగలో తొక్కేసి లీజులు ఇచ్చేయాలన్నా… ఎవరికి పవర్ ఉందీ, మరెవరికి లేదు.. ఐఏఎస్ అధికారులు స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారా? వారిపై మంత్రుల ఒత్తిళ్లు లేవా? లేదంటే ఐఏఎస్ అధికారులే మంత్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నారా?  ఇందులో ఏది నిజం, మరేది అసత్యం… 

 

సస్పెండ్ కు గురైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ప్రస్తుతం (జనవరి ఏడవ తేదీనాటికి) చంచల్ గూడా జైల్లో అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖకు కార్యదర్శిగా పనిచేసిన రోజుల్లో ఓబులాపురం మైన్స్ లీజి విషయంలో లూజ్ గా వ్యవహరించారన్న ఆరోపణ ఎదుర్కుంటున్నందునే ఆమె, జైల్లో సాధారణ ఖైదీలతో పాటుగా  అల్పాహారం, భోజనం, చేయాల్సి వస్తోంది. నేరారోపణ అయిన ఖైదీలకు మాదిరిగా తెల్ల చీర, తెల్ల జాకెట్ వంటివి ధరించాల్సిన అవసరం లేకపోవడంతో శ్రీలక్ష్మి తన సొంత డ్రెస్ లోనే జైల్లో తిరుగుతున్నారు. ఈ పరిస్థితి రావడానికి కారణం అప్పట్లో గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నరోజుల్లో ఓబుళాపురం లీజ్ పైల్ పై అడ్డగోలుగా సంతకం చేయడమేనన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి.

చంచల్ గూడ జైల్లో శ్రీలక్ష్మి ఉన్న ఈ సమయంలోనే రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీబీఐ వారికి తన వాగ్మూలం ఇచ్చారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు రిజర్వ్ చేసిన ఇరువైఐదు హెక్టార్ల స్థలాన్ని ఓబుళాపురం మైన్స్ కు లీజు కింద ఇవ్వడంలోని అవకతవకల కేసుపై సీబీఐ విచారణ జరుపుతోంది. రెండువేలఏడు  ప్రాంతంలో సబిత గనులశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డి ఏభైమూడవ సాక్షిగా ఉన్నారు. సీబీఐ చార్జ్ షీట్ లో ఈ విషయం చాలా స్పష్టంగానే ఉంది.

సీబీఐ వారి దగ్గర సాక్షిగా సబిత చాలా విషయాలు పూసగుచ్చిమరీ చెప్పారట. నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి తనవై ఒత్తిడి తెచ్చారనీ, అందుకే ఓఎంసీకి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన ఇరవైఐదు హెక్టార్ల భూమిని లీజు విషయంలో అనుకూలంగా సిఫార్సు చేయాల్సి వచ్చిందంటూ సబిత చెప్పారట. ఈ లీజు విషయంలో శ్రీలక్ష్మి అత్యుత్సాహం ప్రదర్శించారని కూడా సబిత వాగ్మూలంలో చెప్పారట.

ఈ వాగ్మూలంలోని విషయాలు వినడానికి బాగానే ఉన్నా, నిజంగానే ఇదంతా సాధ్యమేనా అని ఓసారి ఆలోచించుకోవాల్సిందే. ఒక్క మనరాష్ట్రంలోనేకాదు, దేశంలో ఎక్కడైనా మంత్రిని ఓ అధికారి ప్రభావితం చేసి తాను అనుకున్న పనులను చక్కబెట్టుకోగలరా? ఐఏఎస్ అధికారులకు నిజంగానే అంత పవర్ ఉంటే, ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. వాస్తవమం ఏమిటంటే, చాలా మంది విషయంలో ఐఏఎస్ అధికారులు కోరలు తీసేసిన పులులే. మంత్రులు, ముఖ్యమంత్రులు ఆడమన్నట్టు ఆడే కీలుబొమ్మలే. జిల్లా కలెక్టర్లయినా, శాఖల కార్యదర్శులైనా బ్యూరోక్రాట్స్ లో చాలామంది ప్రజాప్రతినిధులు చెప్పినట్టు నడుచుకునేవారే. ఒక వేళ సిన్సియర్ ఆఫీసర్ అయితే, మంత్రులకు తమ పని కాకపోతే సదరు ఆఫీసర్ని ఫుట్ బాల్ తన్నినట్టు వేరేచోటికి తన్నేయడం చాలా సందర్భాల్లో జరుగుతున్నదే. మరి అలాంటప్పుడు రెండువేలఏడు నాటి ఈ సంఘటనలో నాటి గనుల మంత్రి సబితపై శ్రీలక్ష్మి అనే ఈ ఐఏఎస్ ఆఫీసర్ అంతగా ఎలా ఒత్తిడి తీసుకురాగలిగారన్నది ఆశ్చర్యమే.

అప్పట్లో మన రాష్ట్రానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆప్యాయంగా `చెల్లెమ్మా’ అని పిలుచుకునేది ఈ చేవెళ్ల సబితనే. అంటే, సబితపై ఒత్తిడి తీసుకురావడమే నిజమయ్యే పక్షంలో సదరు ఐఏఎస్ అధికారిణి కచ్చితంగా ముఖ్యమంత్రిని కూడా ఓ ఆటఆడించే ఉండాలి. బహుశా ఈ విషయం ముందుముందు సీబీఐ విచారణలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చెప్పినా చెప్పవచ్చు. ఏతావాతా తేలబోయేది ఏమంటే, అటు వైఎస్సార్ నీ, ఇటు సబిత వంటి మంత్రులను శ్రీలక్ష్మి వంటి ఐఏఎస్ లు లొంగదీసుకున్నారనీ, ప్రజాప్రతినిధులంతా ఏపాపం తెలియని వారని.

అదే జరిగితే, అంతకంటే విడ్డూరం మరొకటి ఉంటుందా. ప్రస్తుతం సబిత తన వాగ్మూలంతో ఇలాంటి డ్రామాకు తెరతీస్తున్నారన్న అనుమానాలు కనీసం కొందరిలోనైనా కలగకమానదు.

రిజర్వ్ ప్రాంతాన్ని సిఫార్సు చేయాలంటూ శ్రీలక్ష్మి తనపై ఒత్తిడి తెచ్చారంటూ సబిత ఇచ్చిన వాగ్మూలం నిజమయ్యే పక్షంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కనీసం మాటమాత్రంగానైనా తన ముద్దుల చెల్లెమ్మకు చెప్పకుండానే ఐఏఎస్ అధికారి చేతనే పనులు చక్కబెట్టుకుని ఉండవచ్చు. అందుకే శ్రీలక్ష్మి ఒక మంత్రిపై ఒత్తిడి తీసుకురాగలిగే స్థాయికి వెళ్ళి ఉండవచ్చు.

 

వీటిలో ఏదైనా జరిగిఉండవచ్చు. నిజం నిలకడమీదనే తేలుతుంది. అయితే, ప్రస్తుతానికి సబిత వాగ్మూలంలో చెప్పిన విషయాలు ఐఏఎస్ వర్సెస్ మంత్రుల మధ్య మరింత అఘాతం పెంచవచ్చు. అంతా సవ్యంగా జరిగితే, మా ప్రతిభ, లేకుంటే, అధికారుల తప్పిదాలే అన్న చందంగా సాగుతున్న చాపకింద బాగోతాలు వెలుగుచూడాలంటే మరికొంతకాలం వేచిఉండక తప్పదు.

– తుర్లపాటి నాగభూషణ రావు