Pages Menu
Categories Menu

Posted by on Feb 7, 2011 in Fake News, Funtertainment, TG Roundup

రేమండ్స్ మొలత్రాడు

సుత్తి సమయం

నేను బి టెక్ రెండవ ఏడాది వేసిన చిన్న స్కిట్ ఇది. ఎందుకో మీతో పంచుకోవాలని అనిపించింది. ఇక మొదలేడదాము.

బ్యాక్ గ్రౌండ్: ప్రతి మూడు నెలలకు మా కాలేజి లో ఒక సంస్కృతిక కార్యక్రమం వుండేది. అందులో మా వంతుగా ఈ చిన్న ప్రకటన (advertisement) లాంటి స్కిట్ చేసాము.

సహజమైన కోతి లక్షణం వల్ల నేను, శ్రీను ఎంచుకున్న వస్తువు, రేమండ్స్ మొలత్రాడు. కిందా మీదా పడి చిన్న స్టొరీ అల్లాము. స్టొరీ ఏంటి అంటే, భవిష్యత్తు కాలంలో ఒక రోబోట్ కి పుట్టిన  కవల పిల్లలు తప్పిపోయి మళ్ళి ఈ రేమండ్స్ మొలత్రాడు వల్ల ఒక్కటి అవ్వడం. ఈ ఏకవాక్య కథని సరదాగా 15-20 నిముషాలు చేసాము. వేదిక మీద మాటలు ఏమీ వుండవు, వట్టి తెర వెనుక మాటలు మాత్రమే.

పాత్రలు:
తెరవెనుక: కనక ప్రసాద్
రాబోట్: రమేష్, చాలా లావుగా ఉండేవాడు
కవల పిల్లలు: శ్రీను, శ్రీనివాస్
అమ్మాయి: దుర్గేశ్, చాలా సన్నగా వుండేవాడు

“అది రెండువేల ఇరవై సంవత్సర౦, భూగోళం చివరి దశకు వచ్చింది. మిగిలిన కొద్దిమంది మనుషులు చంద్రమండలం వెళ్లి అక్కడ వున్న రోబోట్స్ తో సెటిల్ అవుతున్న టైం. చంద్రమండలం మీద వాతావరణం ఈదురు గాలులతో భయంకరంగా వుంది. అరె, అక్కడ దూరంగా ఏంటి? ఏదో భారంగా కదులుతూ వస్తుంది! అర్రే! ఇదేదో రోబోట్ లాగుంది. పాపం ఎందుకో తెలీదు చాలా నిదానంగా నడుస్తుంది.”

ఇంతలో రాబోట్ ధనా, దనా అని భారంగా అడుగులు వేసుకుంటూ వచ్చి ప్రేక్షకులకు ఎదురుగ నిలబడుతాడు.

“ఎందుకో తెలీదు గానీ ఈ రోబోట్ ఇబ్బందిగా కదులుతుంది. బహుశా ఇది ప్రెగ్నెంట్ రోబోట్ అనుకుంటా! అరె, ఏంటది, అలా రోబోట్ కాళ్ళు ఎందుకు దూరంగా జరుపుతుంది? ఏమి జరుగుతుంది ఇప్పుడు?”

రోబోట్ నడుము మీద రెండు చేతులు పెట్టుకొని తల అటు ఇటు బాధగా ఊపుతూ వుంటుంది. ఇంతలో రోబోట్ వెనక నుంచి శ్రీను మెల్లగా పాకుకుంటూ వచ్చి మెల్లగా రోబోట్ కాళ్ళ మద్య తలపెట్టి బయటకు వస్తాడు. బయటకు వచ్హాక వెల్లకిలా పడుకొని ఏడుస్తుంటాడు, అప్పుడే పుట్టిన పిల్లాడిలా.

“అద్భుతం, అమోహం! ఒక రోబోట్ కి మనిషి పుట్టాడు. ఇది చంద్ర మండలం చరిత్రలో ఒక మరపు రాని రోజు. మరి ఈ రోబోట్ ఎందుకు సంతోషం గా లేదు? మళ్ళి ఎందుకు ఇబ్బందిగా కదులుతుంది. ఏమి జరుగుతుందో ఇప్పుడు?”

ఈసారి శ్రీనివాస్ మెల్లగా వచ్చి మళ్లీ కాళ్ళ మద్య నుంచి బయటకు వచ్చి ఏడుస్తుంటాడు.

“అరె, అరె, ఇది మహాద్భుతం! రోబోట్ కి మనిషి పుట్టడమే కాదు, అదీ కవల పిల్లలే? ఆహా! ఇప్పుడే పుట్టిన తన పిల్లలని చూసుకొని ఆ రోబోట్ ఎంత సంతోషంగా వుంది. తన నెత్తిన వున్న తెన్టికల్స్ రెండు తెంపి, తన పిల్లల మొలకు కట్టుతుంది. ఆహా, ఏమి ఈ రోబోట్ ప్రేమ! తన పిల్లలకి గుర్తుగా తాడు కట్టడమే కాకండా, ఒకడికి బిల్లా అని మరొకడికి రంగ అనీ పేరు పెట్టింది. బిల్లా, రంగ ఆనందంగా మొలలు చూసుకుంటూ ఆడుకుంటున్నారు”

ఇంతలో రోబోట్ ఎవరో పిలుస్తున్నట్టు తల అటు ఇటు తిప్పుతూ వుంటుంది.

“పాపం ఈ రోబోట్ కి మార్స్ నుంచి పిలుపు వచినట్టుంది, మరి ఈ బిల్లా, రంగ ల పరిస్తితి ఏంటో ? పాపం ఈ రోబోట్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, మాటలు రాని, వూహ తెలియని ఈ పసి బిల్లా, రంగ ఎల్లా బ్రతుకుతారో?”

రోబోట్ కళ్ళు తుడుచుకుంటూ, వెనక్కు చూసుకుంటూ వెళుతుంది. బిల్లా, రంగ స్టేజి కి చేరి ఒక వైపు మెల్లగా పాకుకుంటూ వెళతారు. కర్టన్ డ్రాప్అవుతుంది.

“అలా విడిపోయిన బిల్లా, రంగ ఇరవై సంవత్సరాలు ఎక్కడ వున్నారో, ఏమై పోయారో, ఇప్పుడు మళ్ళి ఇలా స్పేస్ షిప్ స్టాండ్ దగ్గర కలిసారు. చూడండి ఏమవుతుందో?”

తెర లేస్తుంది. స్టేజి మద్యలో దుర్గేశ్ అమ్మాయి లాగా డ్రెస్ వేసుకొని నిలబడి వుంటాడు. రెండు ప్రక్కల నుంచి బిల్లా, రంగ ఎంటర్ అవుతారు. అమ్మాయి అందాన్ని చూస్తూ స్టేజి మధ్యలో గుద్దుకుంటారు. ఒకరిని ఒకరు కోపంగా చూసుకొంటూ కాలర్ పట్టుకుంటారు.

“వీళ్ళ దుపతేగా! కలవక కలవక కలిసారు, కొట్టుకుంటున్నారు ఏంటి, మై గాడ్”

తెగ కొట్టుకోడం స్టార్ట్ చేస్తారు. కరాటే, కర్రసాము అన్ని చేస్తారు. చివరలో కత్తులతో యుద్ధం మొదలుపెడతారు. ఈ మద్యలో ఒకరి మొల దగ్గర ఇంకొకరు షర్టు చింపి, ఆగిపోతారు.

“ఆహా! బిల్లా, రంగ చివరకు కలిసారు. అదే, అదే, జిగేలుమని మెరుస్తున్న ఆ పటిష్టమైన మొలత్రాడు. రేమండ్స్ మొలత్రాడు. ఒక్క సారి కడితే చాలు, మిగులు పదివేలు. జీవిత కాలం మన్నిక. ఇది ఎంత గట్టిది అంటే! వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి, రేమండ్స్ మొలత్రడుని ఇంకొక మొలత్రాడు మాత్రమే తె౦పాలి.”